భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. ప్రజలు కరోనా థర్డ్‌వేవ్ ఆందోళన కలిగిస్తోంది. ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు వారి కేసులు 2 లక్షలకు చేరువు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,94,720 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటితో పోలిస్తే 15.9% ఎక్కువ. అలాగే గత 24 గంటల్లో దేశంలో 165 మరణాలు నమోదయ్యాయి, దేశవ్యాప్తంగా 4,84,378 మంది మరణించారు. అదే సమయంలో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 4,868 వద్ద ఉంది. ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో కోవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 9 లక్షలు దాటడంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతం చేరగా.. వారంవారీ పాజిటివిటీ రేటు 9.82 శాతంకు చేరుకుంది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కరోనా విజృంభణతో హరిద్వార్, రిషికేశ్‌లోని గంగానది ఘాట్‌ల పవ్రిత స్నానాలను నిషేధించారు. మకర సంక్రాంతి పండుగ నేపథ్యంలో మూడు రోజుల పాటు సముద్ర, నదీ తీరాల వద్ద పవిత్ర స్నానాలను నిషేధిస్తూ ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతోంది. నిన్న 85,26,240 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మొత్తం 153 కోట్ల డోసుల పంపిణీ జరిగింది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.