దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే నమోదు అవుతున్నాయి. అయితే.. జనవరిలో 15 తరువాత కరోనా సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మూడు నాలుగు రోజుల నుంచే వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టాయి. ఇక మనదేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎప్పుడు చేపట్టనున్నారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే దానిపై ఖచ్చితమైన డేట్ అయితే కేంద్రం చెప్పడం లేదు. జనవరి నుంచి దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. టీకా సామర్ధ్యం, భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తరువాతే అనుమతులు ఇస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ పరిశోధన, తయారీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ముందు నుంచి 7 నెలల్లో దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు.