వచ్చేవారం ఆస్ట్రాజెనికా టీకాకు అనుమతి.. కొత్త డేటాను సమర్పించిన సీరం..!
India Likely to Approve AstraZeneca Vaccine by Next Week. కరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తి కల్పించే వాక్సిన్
By Medi Samrat Published on 23 Dec 2020 5:55 AM GMTకరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తి కల్పించే వాక్సిన్ అతి త్వరలో భారత్‌లో అందుబాటులోకి రానుంది. వచ్చేవారం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ది చేసిన టీకా అత్యవసర వినియోగం కింద కేంద్రం అనుమతులు మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత రెగ్యులేటరీ కోరిన అదనపు డేటాను పూణే లోని సీరం కంపెనీ సమర్పించడంతో ఇందుకు మార్గం సుగమమైందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది.
తక్కువ ఆదాయం గల దేశాలకు, ఉష్ణ దేశాలకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వరప్రదాయిని అంటున్నారు. చౌక అయిన ఈ టీకామందును సులభంగా ట్రాన్స్ పోర్ట్ చేయవచ్చు. పైగా సాధారణ ఉష్ణోగ్రత గల ఫ్రిజ్ లోనూ ఇది ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. అదే ఫైజర్ టీకా ధర ఎక్కువగా ఉండడంతో పాటు దాన్ని భద్రపరిచేందుకు అతిశీతల ఉష్ణోగ్రతలు కావాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం ఈ టీకా వైపు మొగ్గుచూపడంలేదని తెలుస్తోంది. ఆస్ట్రాజెనికా టీకాకు మరో వారం రోజుల్లో అనుమతులు రావచ్చునని సంబంధింత వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టీకా అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ నెల 9న పరిశీలించింది. వాక్సిన్లలపై మరింత సమాచారం ఇవ్వాలని తయారీ సంస్థలను కోరింది. దీంతో సీరమ్ కంపెనీ ఇటీవల ఆ సమాచారాన్ని కేంద్రానికి అందించింది. ఫైజర్, భారత్ బయోటెక్‌ల నుంచి అదనపు సమాచారం రావాల్సి ఉంది. కాగా.. అన్ని కంపెనీల వివరాల వచ్చిన తరువాతే వ్యాక్సిన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. కాగా.. ఇప్పటికే యూకే, అమెరికా దేశాల్లో పైజర్‌కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.
గత 24 గంటల్లో భారత్‌లో 23,950 కొత్తగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 333 మంది మృతిచెందారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,99,066కు పెరిగింది. 2,89,240 యాక్టివ్ కేసులు ఉండగా.. 96,63,382 మంది రికవరీ అయ్యారు. ఈమహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1,46,444 మంది ప్రాణాలు కోల్పోయారు.