కర్ణాటకలో బీజేపీకి ఊహించని బలం

రాజకీయవేత్తగా మారిన నటి, కర్ణాటకలోని మాండ్యా నుంచి స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ శుక్రవారం బీజేపీలో చేరారు.

By Medi Samrat  Published on  5 April 2024 12:45 PM GMT
కర్ణాటకలో బీజేపీకి ఊహించని బలం

రాజకీయవేత్తగా మారిన నటి, కర్ణాటకలోని మాండ్యా నుంచి స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ శుక్రవారం బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక, కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్, మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ తదితరులు ఆమెకు భారతీయ జనతా పార్టీలోకి ఘన స్వాగతం పలికారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మాండ్యా స్థానాన్ని తన కూటమి భాగస్వామి జేడీ(ఎస్)కి ఇవ్వడంతో, సుమలత మాండ్యాలోని తన మద్దతుదారులు, శ్రేయోభిలాషులను సంప్రదించిన తర్వాత ఎన్నికల పోటీ నుండి విరమించుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు బుధవారం ప్రకటించారు. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూట‌మికి మ‌ద్ద‌తు ఇవ్వనున్నట్లు తెలిపారు. బీజేపీలో చేరి, ఎన్డీయే అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామికి మద్దతు ఇస్తానని ఆమె ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేద‌ని, రాబోయే రోజుల్లో మీకోసం నేను ప‌నిచేయ‌డం చూస్తార‌ని, బీజేపీలో చేర‌డానికి నిర్ణ‌యించుకున్న‌ట్లు సుమ‌ల‌త తెలిపారు.

సుమలత తన భర్త అంబరీష్ మరణానంతరం మాండ్యా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సుమలత... కుమారస్వామి తనయుడు నిఖిల్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ నుంచి సహకారం లభించింది. జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఇప్పుడు మాండ్యా నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

Next Story