భారత సైన్యం.. జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకుని రావడానికి పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. తీవ్రవాదులతో ఓ వైపు పోరాడుతూనే.. అక్కడి ప్రజలకు కూడా ఎంతో సహాయం చేస్తూ నిలుస్తున్నారు. తాజాగా భారత సైన్యం చేసిన ఓ గొప్ప విషయం వైరల్ గా మారింది.
జమ్మూ కశ్మీర్‌లో పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండుగర్భిణిని భారత సైనికులు ఆస్పత్రికి చేర్చడం కోసం ఐదు కిలోమీటర్లు భుజాలపై మోస్తూ తీసుకెళ్లారు. కుప్వారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ప్రస్తుతం కుప్వారా జిల్లాలో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. గర్భిణిని ఆస్పత్రికి చేర్చేందుకు సైనికులు ఆమెను మంచం మీదనే ఉంచి మోసుకెళ్లినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఐదు కిలోమీటర్లు వెళ్లాక అక్కడి నుంచి రోడ్డు అనుకూలంగా ఉండడంతో ఓ వాహనం ద్వారా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. సైనికులు చేసిన గొప్ప పనిని ప్రజలు మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉన్నారు. గత నెలలో కూడా ఇదే జిల్లాకు చెందిన ఓ గర్భిణిని సైనికులు తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పురిటినొప్పులు మొదలవ్వడంతో ఆమె ఆర్మీ వాహనంలో బిడ్డకు జన్మినిచ్చింది.