దేశం కోసం వెనక్కి తగ్గను..140 కోట్ల ప్రజల రక్షణే నా లక్ష్యం: ఖర్గే
దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని, పార్లమెంట్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
By - Knakam Karthik |
దేశం కోసం వెనక్కి తగ్గను..140 కోట్ల ప్రజల రక్షణే నా లక్ష్యం: ఖర్గే
ఢిల్లీ: దేశ హితాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోనని, పార్లమెంట్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల త్యాగాలను గుర్తు చేస్తూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, సోనియా గాంధీ అన్నీ త్యాగం చేశారని ఆయన అన్నారు. దేశంలో ఓటు దొంగతనం వంటి పెద్ద పోరాటం జరుగుతున్న వేళ తాను వెనక్కి తగ్గబోనని ఖర్గే స్పష్టం చేశారు.
“నా కుమారుడికి ఏమైనా జరిగినా సరే, కానీ దేశంలోని 140 కోట్ల మందిని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఈ పోరాటంలో ముందుండి నిలబడతాను” అని ఆయన పేర్కొన్నారు. పోరాటంలో భయానికి చోటు లేదని, వెనక్కి తగ్గితే రాజకీయంగా అంతం అవుతుందని ఖర్గే హెచ్చరించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, చిన్న విషయాలకే భయపడితే పార్టీ కోసం ప్రాణాలిచ్చే మాటలు చెప్పడం వ్యర్థమని వ్యాఖ్యానించారు. ధైర్యంతో, ఆలోచించి అడుగులు వేయాలని, అందరం కలిసి పోరాడితే విజయం సాధ్యమని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం విజయోత్సాహంతో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారని, కానీ ఒకసారి ఓడితే ఆయన రాజకీయంగా కనుమరుగవుతారని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఓడినా కూడా పార్టీ, భావజాలం బతికే ఉందని, పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేరళలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని గుర్తు చేసిన ఖర్గే, అక్కడ ఎన్డీఏను పూర్తిగా ఓడించడంలో నేతలు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని అభినందించారు. కేరళలో కాంగ్రెస్ జెండా గర్వంగా ఎగురుతోందని అన్నారు. ప్రసంగం ముగింపులో ఖర్గే కార్యకర్తలకు ధైర్యం నింపుతూ, నిరాశకు లోనుకావద్దని పిలుపునిచ్చారు. అనంతరం “వోట్ చోర్, గద్దీ చోర్” అంటూ నినాదాలు చేయించారు. దేశభక్తి నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు.