మన మనసులకు దగ్గరగా ఉండే ఎంతో మందిని మహమ్మారి బలి తీసుకుంది: మోదీ
I feel your pain of losing loved ones says PM Modi. భారతప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.19,000 కోట్ల
By Medi Samrat Published on 14 May 2021 2:17 PM GMTభారతప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.19,000 కోట్ల నిధులు విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9.5 కోట్ల మంది రైతులకు వర్తించేలా నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా ఒక్కోరైతు ఈ విడతలో రూ.2,000 అందుకోనున్నారు. కేంద్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 3 విడతల్లో నగదు సాయం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. నరేంద్ర మోదీ ఏపీకి చెందిన రమ అనే మహిళా రైతుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బంజరు భూములను సాగులోకి తీసుకువచ్చి రైతాంగానికి స్ఫూర్తిగా నిలిచారని మోదీ కొనియాడారు. అందుకు రమ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ద్వారా లభించిన 4 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం ద్వారా విభిన్నరకాల పంటలు పండించి లాభాలు ఆర్జించానని రమ వెల్లడించారు.
ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచానికి కరోనా మహమ్మారి సవాళ్లు విసురుతోందని మోదీ అన్నారు. కరోనాతో ప్రజలు పడుతున్న బాధలు, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు. మన మనసులకు దగ్గరగా ఉండే ఎంతో మందిని మహమ్మారి బలి తీసుకుంది. వారు పడుతున్న బాధలు నేను అర్థం చేసుకోగలనని అన్నారు. ప్రతి ఒక్కరి ప్రధాన సేవకుడిగా.. అందరి బాధలనూ పంచుకుంటానని స్పష్టం చేశారు. రూపం మార్చుకుని మరింత ప్రమాదకరంగా తయారైన మహమ్మారి వల్లే దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనకున్న వనరులను వీలైనంత మేర వాడుకోవడం కోసం అన్ని అడ్డంకులను తప్పిస్తున్నామని.. వీలైనంత ఎక్కువ మందికి కరోనా టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు.