భార్యభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని గడపాల్సింది పోయి.. ఒకరిపై ఒకరు మనస్పర్థలు పెంచుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య కలహాలు రేగాయి. చివరకు భార్యభర్తలు డైవర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. డైవర్స్ కోసం కోర్టు మెట్లెక్కారు. కోర్టులో విచారణ సాగుతుండగా.. భర్త తన దుర్బుద్ధి పోనిచ్చుకొలేదు. భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో అప్‌లోడ్ చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులో జరిగింది. 2016లో వెళ్లియూర్ పంచాయతీ అధ్యక్షుడు సురేష్ బాబు కుమారుడు ఓంకుమార్ (34)తో యువతికి (32) పైళ్లైంది. వీరికి ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
దీంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో డైవర్స్ కావలంటూ భర్త ఓంకుమార్ పూందమల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించి కోర్టులో విచారణ సాగుతోంది. ఈ క్రమంలోనే ఓంకుమార్ తన వక్రబుద్ధితో భార్య వివరాలను మ్యాట్రిమొనిలో ఉంచాడు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు యువతి తండ్రిని కాంటాక్ట్ కావాలని పేర్కొన్నాడు. ఆ తర్వాత యువతి తండ్రికి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. విషయం పసిగట్టిన యువతి తండ్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో మ్యాట్రిమొనిలో వివరాలు పెట్టింది యువతి భర్త ఓంకుమార్ అని తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.