10 ఏళ్లుగా ప్రభుత్వం నా బావను వేధిస్తోంది : రాహుల్
తన బావ రాబర్ట్ వాద్రాను కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు.
By Medi Samrat
తన బావ రాబర్ట్ వాద్రాను కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. హర్యానాలోని షికోపూర్‌లో జరిగిన భూ ఒప్పందంలో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాబర్ట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇదే అంశంపై రాహుల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందని రాహుల్ అన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె కుటుంబం ఎలాంటి వేధింపులనైనా ఎదుర్కొంటుందన్నారు.
'ఎక్స్'పై పెట్టిన పోస్ట్‌లో.. 'గత 10 ఏళ్లుగా ఈ ప్రభుత్వం నా బావను వేధిస్తోంది. ఈ తాజా ఛార్జ్ షీట్ అదే వేధింపుల ప్రచారంలో మరొక భాగం. 'రాబర్ట్, ప్రియాంక, వారి పిల్లలు మరొక హానికరమైన, రాజకీయ ప్రేరేపిత దాడిని ఎదుర్కొంటున్నందున నేను వారికి అండగా నిలుస్తాను. వాళ్లందరూ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారని నాకు తెలుసు. ధైర్యంగా, గౌరవంగా అలా కొనసాగిస్తారు. అంతిమంగా సత్యమే గెలుస్తుంది’ అని రాశారు.
అంతకుముందు గురువారం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 56 ఏళ్ల రాబర్ట్ వాద్రాపై క్రిమినల్ కేసులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చేసింది. 37.64 కోట్ల విలువైన రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్‌లలో ఉన్న 43 స్థిరాస్తులను కూడా ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ జప్తు చేసింది. ఈ ఆస్తులు రాబర్ట్ వాద్రా, స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అతని సంబంధిత సంస్థలకు చెందినవి.
చార్జిషీట్ అనంతరం రాబర్ట్ వాద్రా కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రభుత్వం తనపై తీసుకుంటున్న రాజకీయ చర్యలకు ప్రస్తుత చర్య పొడిగింపు అని పేర్కొంది.