భారీ ఎత్తున హెరాయిన్ పట్టివేత.. ఏపీకి కూడా లింక్..?
Heroin seized mid-sea from Iranian boat. మాదక ద్రవ్యాల (డ్రగ్స్) తో భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇరాన్‌కు చెందిన బోటును
By Medi Samrat Published on 20 Sept 2021 12:42 PM ISTమాదక ద్రవ్యాల (డ్రగ్స్) తో భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇరాన్‌కు చెందిన బోటును తీర ప్రాంత రక్షణ దళం శనివారం రాత్రి పట్టుకుంది. అందులో ఉన్న ఏడుగురు ఇరానియన్లను అదుపులోకి తీసుకుంది. బోటులో దాదాపు 30 నుంచి 50 కేజీల హెరాయిన్ లభ్యమైందని అధికార వర్గాలు తెలిపాయి. సుమారు రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు అక్రమ రవాణా అవుతోంది. టాల్కం పౌడర్ పేరిట కంటైనర్లలో తరలిస్తుండగా గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఉన్న ముంద్రా పోర్టులో డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్‌కు చెందిన హసన్ హుస్సేన్ లిమిటెడ్ అనే సంస్థ వీటిని పంపినట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్ ఫర్మ్ అనే సంస్థ వీటిని బుక్ చేసుకుంది. కన్‌సైన్‌మెంట్‌లో పేర్కొన్న అడ్రస్ మేరకు విజయవాడలోని సత్యనారాయణపురం వెళ్లిన అధికారులకు అక్కడ ఓ డాబా ఇల్లు మాత్రమే కనిపించింది. డీఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇరాన్‌కు చెందిన రెండు నౌకల్లో భారత్‌కు వస్తున్న 2,988 కిలోల హెరాయిన్‌ను నిఘా పెట్టి గుజరాత్‌లో పట్టుకున్నారు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి బందరు పోర్టుకు దిగుమతి చేసుకొంటున్నట్లు తేలింది. 988 కిలోల చొప్పున కంటైనర్లలో వాటిని ముంబైకి చేర్చేలా దిగుమతిదారులు బుక్ చేసినట్లు గుర్తించారు. కంటైనర్లలో ఉన్న పౌడర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరిశీలించి హెరాయిన్ అని తేలాక ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ జాతీయులు ఉన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆశి ట్రేడింగ్ కంపెనీలో అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. గోవింద రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.