చెన్నైలోని పలు ప్రాంతాలు మరియు శివారు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సాయంత్రం 5:30 గంటల వరకు దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మెరీనా బీచ్, పాటినపాక్కం, ఎంఆర్‌సి నగర్, నందనం, మైలాపూర్, ఇతర సబర్బన్ ప్రాంతాలతో సహా చెన్నై అంతటా ఓ మోస్తరు వర్షంతో చల్లని గాలులు వీచాయి. రహదారులు జలమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఇదిలావుంటు.. వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎమ్మార్సీ నగర్‌లో సాయంత్రం 6:15 గంటల వరకు అత్యధికంగా 176.5 మిమీ వర్షపాతం నమోదైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెండు గంటల పాటు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా. డిసెంబర్ 31, జనవరి 1 తేదీలలో తమిళనాడు తీరప్రాంతం, పుదుచ్చేరి, కారైకాల్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగానే పేర్కొంది.