రెండు రోజులు స్కూళ్లు మూసివేత.. జాగ్రత్తగా ఉండాలంటూ..

Heavy Rain In Tamil Nadu. తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నై మరియు సమీప

By Medi Samrat  Published on  7 Nov 2021 6:30 PM IST
రెండు రోజులు స్కూళ్లు మూసివేత.. జాగ్రత్తగా ఉండాలంటూ..

తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెన్నై మరియు సమీప ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా నాలుగు జిల్లాల్లోని పాఠశాలలు రాబోయే రెండు రోజులు మూసివేయనున్నారు. అంతేకాకుండా అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలకు దిగాయి. తమిళనాడు ఉత్తరాన ఉన్న తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలను వచ్చే రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.

చెన్నైలో రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది, ఈ ఉదయం 8.30 గంటల వరకు 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నైతోపాటు పరిసర కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో రెండు రోజులపాటు స్కూళ్లను మూసివేస్తున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదివారం ప్రకటించారు. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన పెరంబూర్ బ్యారక్స్ రోడ్డు, ఒట్టేరి బ్రిడ్జి, పాడి తదితర ప్రభావిత ప్రాంతాలను సీఎం స్టాలిన్‌ సందర్శించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని డీఎంకే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు.

అడయార్ నది ఒడ్డున ఉన్న కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి అభ్యర్థన మేరకు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సహాయక చర్యలలో సహాయం చేయడానికి నాలుగు బృందాలను తరలించింది.


Next Story