రోడ్డు మార్గంలో ప్రయాణించండి : ప్ర‌ధానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ‌

Gujarat Cong MLA invites PM to Somnath with request to travel by road. గుంతలమయమైన రోడ్డును ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు

By Medi Samrat
Published on : 23 Aug 2022 3:09 PM IST

రోడ్డు మార్గంలో ప్రయాణించండి : ప్ర‌ధానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ‌

గుంతలమయమైన రోడ్డును ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇందుకోసం భావ్‌నగర్ టూ సోమనాథ్ రోడ్డు మార్గంలో ప్ర‌యాణించాల‌ని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విమల్‌ చుడసామా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

సోమనాథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే చూడాసామా లేఖలో.. "కోస్టల్ హైవేకు ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది, హైవే అసంపూర్తిగా ఉంది. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్డుపై చాలా చోట్ల గుంతలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి చాలా ఘోరమైన ప్రమాదాలకు కారణమయ్యాయి. నేను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రికి లేఖ రాసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

ప్రధానమంత్రి ఈ రహదారిపై రోడ్డు మార్గంలో ప్రయాణించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చవిచూస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ఉందన్నారు. ప్రధానమంత్రి ఆగస్టు 27 నుండి గుజరాత్‌లో రెండు రోజుల పర్యటించ‌నున్నారు. ఈ పర్యటన నేప‌థ్యంలో ప్రధాని సోమనాథ్‌ను రోడ్డు మార్గంలో సందర్శించాలని విమల్‌ చూడసామ ఆకాంక్షించారు.

సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉన్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది మంది భక్తులు ఈ రహదారిపై ప్రయాణిస్తారు. "భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను ప్ర‌ధాని అర్థం చేసుకోవాలి" అని విమల్‌ చూడాసమా అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రధానికి రాసిన లేఖ గురించి తనకు తెలియదని సోమనాథ్ జిల్లా బీజేపీ కమిటీ అధ్యక్షుడు మాన్‌సిన్ పర్మార్ అన్నారు. అయితే 'నేను సమస్యను పరిశీలిస్తాను' అని అన్నారు.

బిజెపి ప్రధాన అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ ఈ లేఖపై స్పందిస్తూ ప్రచారం, రాజకీయ మైలేజ్ కోసమేన‌ని.. ఇది ఓ రాజకీయ స్టంట్‌గా అభివర్ణించారు. ఎమ్మెల్యే ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. సమస్య పరిష్కారంపై తనకు తీవ్రమైన ఆసక్తి ఉంటే.. ప్రధానికి లేఖ రాయడమే కాకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో విచారణ చేపట్టి ఉండేవారని వ్యాస్ చెప్పారు.


Next Story