ఆ ఏడుగురిపై వేటు వేసిన బీజేపీ
Gujarat BJP suspends 7 of its leaders for contesting polls as independents. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో సహా అగ్రనేతలంతా
By Medi Samrat
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో సహా అగ్రనేతలంతా గుజరాత్ రాష్ట్రంలో ప్రచారాన్ని మొదలెట్టారు. పలువురికి టికెట్లను కేటాయించింది బీజేపీ అధిష్టానం. కొందరు ఆశావహులను పట్టించుకోలేదు. తాజాగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ నుంచి టికెట్ దక్కని ఏడుగురు రెబల్స్‌గా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. వారిపై బీజేపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన ఏడుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసింది. పార్టీపై తిరుగుబాటు చేసిన ఏడుగురు నేతలను గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ ఎమ్మెల్యేలను ఆరేళ్లపాటు సస్పెండ్ చేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌ను ఉటంకిస్తూ బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది.
పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారిలో మధు శ్రీవాస్తవ, అరవింద్ లడానీ, దిను పటేల్, హర్షద్ వాసవ, ధవల్ సింగ్ ఝాలా ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అరవింద్ లడానీ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బుజ్జగించిన తరువాతకూడా ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. వాఘోడియా నుంచి బీజేపీ టికెట్‌పై ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మధు శ్రీవాస్తవకు టికెట్ రాకపోవడంతో ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గుజరాత్‌లో ఏడోసారి అధికారాన్ని కోరుతున్న బీజేపీ 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. 2017 గుజరాత్ ఎన్నికల్లో 182 స్థానాలకు గాను 99 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. పార్టీ గత 27 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.