ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు ప్రారంభించడం లేదు : ప్రధాని మోదీ

Govt not launching projects aiming polls, working 24 hrs for development. కేంద్ర‌ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు ప్రారంభించడం లేదని,

By Medi Samrat  Published on  19 Nov 2022 10:29 AM GMT
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు ప్రారంభించడం లేదు : ప్రధాని మోదీ

కేంద్ర‌ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులు ప్రారంభించడం లేదని, దేశాభివృద్ధికి 24 గంటలూ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ విమర్శల‌పై స్పందిస్తూ.. పాత మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని అన్నారు. వివరాలు తెలియకుండానే.. ప్రభుత్వ పనులు, విధానాలపై వ్యాఖ్యానిస్తుంటార‌ని మండిప‌డ్డారు.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం ఇటానగర్‌లోని 'దోనీ పోలో' గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్ర‌ధాని శ‌నివారం ప్రారంభించారు. అలాగే 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఈశాన్య ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉందని అన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రి అయ్యాక ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను (ఈశాన్య ప్రాంత అభివృద్ధి) ఏర్పాటుచేసిన‌ నాటి నుండి ఈ ప్రాంతం మార్పు ప్రారంభమైందని తెలిపారు.

ఇటానగర్‌లోని 'డోనీ పోలో' విమానాశ్రయం అరుణాచల్ ప్రదేశ్‌లోని మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, 690 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రూ. 640 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయబడింది. 2300 మీటర్ల రన్‌వేతో, విమానాశ్రయం అన్ని వాతావరణ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ ప్లాంట్‌ను రూ. 8450 కోట్లకు పైగా ఖర్చు చేసి, అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు.

"2014 తర్వాత కొత్త ఊపు మొదలైంది. ఈశాన్య ప్రాంతం ఇప్పుడు న్యూఢిల్లీకి ఎంతో దూరంలో లేదు. ఈ ప్రాంతంలోని మారుమూల లేదా చివరి గ్రామం దేశంలోని మొదటి గ్రామంగా పరిగణించబడుతుంది" అని ఆయన చెప్పారు. భారతమాత సంక్షేమమే మా కల అని చెప్పిన మోదీ.. తమ ప్రభుత్వం అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 2014 వరకు.. ఈశాన్య ప్రాంతంలో కేవలం తొమ్మిది విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతం నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మధ్య విమాన కనెక్టివిటీని సులభతరం చేస్తూ మరో ఏడు నిర్మించిందని తెలిపారు. దాదాపు 24 నిమిషాల పాటు హిందీలో చేసిన ప్రసంగంలో.. వెదురు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజల జీవితం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో భాగమని.. అనేక వెదురు ఉత్పత్తులు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయని మోదీ అన్నారు. బ్రిటీష్ వారు అమలు చేసిన వెదురు చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెదురును సులభతరం చేసిందని ప్రధాని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లో హైవేల అభివృద్ధికి రూ.50,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు.


Next Story