రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
Government official cannot work as state election commissioner. రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
By Medi Samrat Published on 13 March 2021 6:29 AM GMTప్రస్తుతం ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారికి ఎన్నికల కమిషనర్ బాధ్యతలను అదనంగా అప్పగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనంటూ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేతృత్వం వహించే వ్యక్తి స్వతంత్రుడై ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ప్రభుత్వంలో అధికారిగా పని చేస్తున్న వ్యక్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించకూడదని తేల్చి చెప్పింది.
కాగా, గోవాలో న్యాయశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న వ్యక్తికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించం, రాష్ట్ర మున్సిపల్ చట్టం ప్రకారం వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం కారణంగా అక్కడి మున్సిపల్ ఎన్నికలపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేస్తూ ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దానిని సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును విచారించిన సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి వీలులేదని స్పష్టం చేసింది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న అధికారి ఒకరికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ గోవా ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనిపై బాంబే హైకోర్టు స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ గోవా సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని స్వతంత్ర వ్యక్తి ఎస్‌ఈసీగా ఉండాలని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఎస్‌ఈసీగా విధులు నిర్వహించాలనుకుంటే ముందుగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఏది ఏమైనా రాష్ట్రాలు తమ ఇష్టానుసారం ఎస్‌ఈసీలను నియమించుకునేందుకు వీలు లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్‌టాపిగ్గా మారింది.