షాకింగ్.. సీబీఐ కస్టడీ నుంచి 100 కేజీల బంగారం మాయం
Gold Missing From CBI Custody. ఎప్పుడూ అక్రమార్కుల భరతం పట్టే సీబీఐకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది.
By Medi Samrat Published on 12 Dec 2020 7:54 AM GMT
ఎప్పుడూ అక్రమార్కుల భరతం పట్టే సీబీఐకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. చెన్నై సీబీఐ కార్యాలయం నుంచి బంగారం మాయమైంది. సేఫ్టీ కష్టడీ లాకర్ లో ఉండాల్సిన బంగారం మాయం కావటంతో తీవ్ర కలకలం రేగింది. ఆఫీసులోని సేఫ్టీ కష్టడీ లాకర్ లో దాచిన 103 కిలోల బంగారం మాయమయినట్లు అధికారులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విచారణ జరపాలంటూ మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. అయితే.. స్థానిక పోలీసులతో దర్యాప్తు జరిపితే సంస్థ ప్రతిష్ట దిగజారుతుందని, ఈ కేసును సీబీ-సీఐడీకి అప్పగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది సిబిఐకి అగ్ని పరిక్ష కావచ్చు, కానీ వారి చేతులు శుభ్రంగా ఉంటే.. సీత లాగా వారు నిజాయితీగా బయటకు రావచ్చు. అలా కాకపోతే, వారు తీవ్ర పరిణామాలు ఎదర్కోవాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
చెన్నైలోని మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎమ్ఎమ్‌టిసి) అధికారులు.. బంగారం, వెండి దిగుమతుల కంపెనీ అయిన సురానా కార్పొరేషన్ లిమిటెడ్‌కు సాయం చేశారనే ఆరోపణలపై 2012లో నమోదైన కేసుకు సంబంధించి సిబిఐ ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో బంగారు కడ్డీలు, ఆభరణాల రూపంలో ఉన్న 400.47 కిలోల బంగారాన్ని చెన్నైలోని సురానా ఆఫీస్ నుంచి సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని సంస్థ లాకర్లలో పెట్టి సీజ్ చేశారు. ఈ ఖజానాకు సంబంధించిన తాళాన్ని చెన్నైలోని ప్రత్యేక సిబిఐ కోర్టుకు సమర్పించారు. 2013 సెప్టెంబర్‌లో మరో కేసు సురానా కంపెనీ మీద నమోదు చేసింది. 2012లో సీజ్ చేసిన బంగారాన్ని ఆ కేసు నుంచి సురానా కంపెనీ ఫారిన్ ట్రేడ్ ఫాలసీని ఉల్లంఘించిన కేసుకు బదిలీ చేయాలని ఇందులో కోరింది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మొదటి కేసు నుంచి తాజా కేసుకు బదిలీ చేయాలని సిబిఐ అభ్యర్థించింది. అందుకు కోర్టు అంగీకరించింది. బంగారం సీబీఐ కస్టడిలో ఉండడంతో.. భౌతికంగా దాన్ని ముట్టుకోకుండా .. కేసుల పత్రాల్లో మార్పు చేసింది.
2015లో ఈ రెండో కేసుకు సంబంధించిన సరైన ఆధారాలు లభించకపోవడంతో.. కేసును మూసేయాలని కోర్టుకు సిబిఐ నివేదిక సమర్పించింది. దీనికి సిబిఐ స్పెషల్ కోర్టు అంగీకరించింది. కానీ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పారిన్ ట్రేడ్ కు అప్పగించాలని ఆదేశించింది. ఈలోగా.. రూ.1,160కోట్ల రుణ బకాయిల కోసం ఎస్‌బీఐ సురానాపై చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సురానా కంపెనీ నుంచి సిబిఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కోరుతూ ప్రత్యేక సిబిఐ కోర్టును బ్యాంకు ఆశ్రయించింది.
చివరికి ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్‌కు చేరింది. దీనిపై విచారణ జరిపిన ట్రైబ్యూనల్.. సీబీఐ కస్టడిలో ఉన్న బంగారం మొత్తాన్ని సురాణా కంపెనీ చెల్లించాల్సిన బ్యాంకులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో సీబీఐ వాల్ట్‌లను తెరిచింది అందులో బంగారాన్ని తూకం వేయగా.. 103కేజీలు తక్కువగా దీంతో అంతా షాకయ్యారు.