భారతదేశంలో పెట్రోల్-డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే..! తగ్గించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. కానీ పట్టించుకునే నాథుడే లేరు. అయితే అలా అడిగిన పాపానికి ఆఫ్ఘనిస్తాన్ కు వెళ్లిపొమ్మని అంటున్నారు కొందరు నేతలు. ఇంధన ధరలపై ప్రశ్నించిన మీడియాపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్లండి.. అక్కడైతే చౌకగా పెట్రోల్ దొరుకుతుంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కట్నిలో ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌రతన్ పాయల్‌ని ఇంధన ధరలపై ప్రశిస్తే.. తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల బదులుగా కోవిడ్ మూడవ వేవ్ గురించి ఆలోచించాలని రిపోర్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో రామ్ రతన్ పాయల్, మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు ఎవరూ మాస్క్‌లు ధరించలేదు.