ప్రధానికి భద్రతా లోపంపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Giriraj Singh's big statement on PM's security lapse. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్
By Medi Samrat
పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న సెక్యూరిటీ బ్రీచ్ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. డ్రోన్ లేదా టెలిస్కోపిక్ గన్ తో ప్రధానిని చంపి ఉండవచ్చని వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి చోటు చేసుకుని ఉండవచ్చని ఆయన ఆరోపణలు చేశారు. ఛత్రపతి శివాజీ దయ కారణంగా ప్రధాని మోదీ తప్పించుకున్నారని గిరిరాజ్ సింగ్ అన్నారు. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాత నేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ భద్రత విషయంలో పంజాబ్ ప్రభుత్వం చేసిన లోపాలను క్షమించరాదని అన్నారు.
ప్రధాని పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను జాగ్రత్త పరచాలంటూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతా లోపాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ నిర్వహించింది. ఈ కేసులో సోమవారం తదుపరి విచారణ వరకు కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఎటువంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. ప్రధానికి రక్షణ కల్పించడం జాతి భద్రతకు సంబంధించిన విషయం. ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఈ కేసులో వృత్తిపరమైన నిపుణులు దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీంతో ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులు జాగ్రత్త పరచాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది.