ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీ చెకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిబంధలను అతిక్రమిస్తే ఎవరినైనా ఎయిర్ పోర్టు సిబ్బంది ఆపేస్తుంది. తాజాగా చెన్నై విమానాశ్రయంలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్‌ను కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారి నిలిపేశారు. ఫైనాన్స్ మినిస్టర్ ను ఆపివేయడానికి కారణం ఏమిటో తెలుసా..? ఆయన ఏకంగా రెండు ల్యాప్ టాప్ లను తీసుకుని వెళుతున్నందుకు..! త్యాగరాజన్ రెండు లాప్‌టాప్స్‌ను తీసుకెళ్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని సీఐఎస్ఎఫ్ అధికారి చెప్పారు. అయితే ఉన్నతాధికారుల జోక్యంతో త్యాగరాజన్ ప్రయాణానికి అనుమతి లభించింది.
పళనివేల్ త్యాగరాజన్ చెన్నై నుంచి తూత్తుకుడి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ దగ్గర ఆయన తన బ్యాగును స్కానింగ్ కోసం ఇచ్చారు. అందులో రెండు లాప్‌టాప్‌లు కనిపించడంతో సీఐఎస్ఎఫ్ అధికారి అభ్యంతరం తెలిపారు. ఓ ప్రయాణికుడు రెండు లాప్‌టాప్‌లను తీసుకెళ్ళరాదని చెప్పారు. త్యాగరాజన్ స్పందిస్తూ అలాంటి నిబంధన ఏదీ లేదన్నారు. త్యాగరాజన్ రాష్ట్ర మంత్రి అని తెలియడంతో విమానాశ్రయం ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆయనకు క్షమాపణ చెప్పారు. పళనివేల్ త్యాగరాజన్ ఒక లాప్‌టాప్‌నే తీసుకొచ్చినట్లు సీఐఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ భావించి ఉంటారని, అందుకే రెండో లాప్‌టాప్‌ను ట్రేలో ఉంచాలని అడిగి ఉంటారని అధికారులు వివరణ ఇచ్చారు. తాము సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించామని, ఎటువంటి సమస్య లేదని చెప్పారు.