వితంతువును వివాహం చేసుకున్న ఓ యువకుడి కుటుంబానికి విచిత్రమైన షరతులు విధించారు రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లా కైరోట్ గ్రామ కుల పంచాయతీ పెద్దలు. వారికి విధించిన జరిమానా రూ.15 లక్షలు చెల్లించనందుకు గ్రామ రహదారి సహా.. నీటిని ఉపయోగించకుండా నిషేధించారు. ఆపై గ్రామం నుంచి బహిష్కరిస్తూ తీర్మానించారు.
29ఏళ్ల లక్ష్మణ్ కామద్.. అతని సామాజిక వర్గానికే చెందిన వితంతువును ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 డిసెంబర్ 30న జరిగిన ఈ వివాహం పట్ల ఇరు కుటుంబాలకు అభ్యంతరమేమీ లేకపోయినా.. 'కామద్' సామాజికవర్గ పెద్దలు మాత్రం ఈ పెళ్లిని అంగీకరించకుండా ఇబ్బంది పెడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
నా సోదరుని పెళ్లిని అంగీకరించేందుకు కుల పెద్దలు మా కుటుంబం నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. ఇప్పుడు గ్రామం విడిచి వెళ్లాల్సిందిగా బలవంతం చేస్తున్నారు. అజ్మేర్ అదనపు ఎస్పీ కిషన్ సింగ్ భాటిని కలిసిన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.