నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం..!

నోయిడాలోని వివిధ రంగాలలో కార్మికులు చేపడుతున్న హింసాత్మక నిరసనలు ఇప్పుడు శాంతిభద్రతలకు సవాలుగా మారాయి.

By -  Medi Samrat
Published on : 13 April 2026 2:42 PM IST

నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం..!

నోయిడాలోని వివిధ రంగాలలో కార్మికులు చేపడుతున్న హింసాత్మక నిరసనలు ఇప్పుడు శాంతిభద్రతలకు సవాలుగా మారాయి. సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ నిరసనలు, రోజు గడిచేకొద్దీ మరింత హింసాత్మకంగా మారాయి. జీతాల పెంపు, ఇతర డిమాండ్లు కోరుతూ వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు క్షణాల్లో రెండు పోలీసు వాహనాలతో సహా ఐదు వాహనాలకు నిప్పు పెట్టారు. పలుచోట్ల రాళ్ల దాడి కూడా జరిగినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

పారిశ్రామిక ప్రాంతాల్లోని కార్మికులకు గౌరవప్రదమైన వేతనం, సురక్షితమైన పని వాతావరణం, సమస్యల సకాల పరిష్కారం కోసం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనాల సవరణను డిమాండ్ చేస్తూ వివిధ పారిశ్రామిక యూనిట్లకు చెందిన పెద్ద సంఖ్యలో కార్మికులు గుమిగూడారు. ప్రదర్శన సందర్భంగా వారు నినాదాలు చేశారు. అయితే, ఆ తర్వాత నిరసనలు హింసాత్మకంగా మారాయి. నోయిడాలోని ఫేజ్ 2, సెక్టార్ 60 ప్రాంతాలలో నిప్పుపెట్టడం, విధ్వంసం, రాళ్ల దాడి వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

నోయిడాను ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు కలిపే అన్ని మోటారు రహదారులపై, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌తో ఉన్న కీలక సరిహద్దు పాయింట్ల వద్ద అనేక బృందాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. నిరసనల నెపంతో ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు నగరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన నిఘా ఉంచుతున్నామని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు పూర్తి అప్రమత్తతతో ఉన్నారని ఒక సీనియర్ ఢిల్లీ పోలీసు అధికారి వార్తా సంస్థకు తెలిపారు. అన్ని కీలక ప్రదేశాలలో తగినంత బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు భంగం కలగనివ్వరని తెలిపారు.

Next Story