నూతన న్యాయమూర్తుల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులపై మీడియా కథనాల పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్ చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. నియామకాలపై అధికారిక ప్రకటన కంటే ముందే వార్తలు రావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఎన్వీ రమణ అన్నారు. జడ్జీల నియామక ప్రక్రియకు ఓ పవిత్రత, హుందాతనం ఉంటాయి. మీడియా స్నేహితులు ఈ ప్రక్రియ పవిత్రతను అర్థం చేసుకోవాలి, గుర్తించాలి అని రమణ అన్నారు. ఇలాంటి బాధ్యతా రహిత రిపోర్ట్‌ల కారణంగా అర్హులైన అభ్యర్థులకు పదవులు దక్కని ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే.. సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం అత్యున్నత న్యాయస్థానానికి కొత్తగా తొమ్మిది మంది న్యాయమూర్తులను నియమించేందుకు సిఫారసు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. జస్టిస్ బీవీ నాగరత్న, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ, జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవి కుమార్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ తదితరులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు కొలీజియం సిఫారసు చేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.