బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 14 మంది మృతి

తమిళనాడులోని శివకాశి సమీపంలోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు సంభవించాయి.

By Medi Samrat  Published on  17 Oct 2023 6:39 PM IST
బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 14 మంది మృతి

తమిళనాడులోని శివకాశి సమీపంలోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో మంగళవారం ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు సంభవించాయి. ఈ ప్ర‌మాదంలో 14 మంది మరణించినట్లు సమాచారం. సమాచారం ప్రకారం.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలో మొదటి పేలుడు సంభవించింది. అక్కడ ఐదుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అదే జిల్లాలోని కమ్మపట్టి గ్రామంలోని మరో యూనిట్‌లో రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలోనే ఉన్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

అంతకుముందు అక్టోబర్ 9వ తేదీన అరియలూరు జిల్లాలోని బాణాసంచా యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఆ ప్ర‌మాదంలో తొమ్మిది మంది చనిపోయారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సంతాపాన్ని వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు నగదు సాయం ప్రకటించారు. జిల్లాలోని విరగలూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ యూనిట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఐదుగురిని తంజావూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తన క్యాబినెట్ సహచరులు SS శివశంకర్, CV గణేశన్‌లను రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి మోహరించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, ఒక మోస్తరుగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Next Story