నటిపై అత్యాచారం కేసు.. మణికందన్ అరెస్టు..!
Ex-AIADMK minister M Manikandan arrested in Bengaluru. మణికందన్.. ఏఐఏడీఎంకే మాజీ మంత్రి.. ఓ నటిపై అత్యాచారానికి
By Medi Samrat Published on 20 Jun 2021 3:51 PM IST
మణికందన్.. ఏఐఏడీఎంకే మాజీ మంత్రి.. ఓ నటిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. కోలీవుడ్ నటిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐఏడీఎంకే మాజీ మంత్రి ఎం.మణికందన్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. కోలీవుడ్ నటి, మలేషియా పౌరసత్వం ఉన్న మహిళ చేసిన అత్యాచార ఆరోపణలతో మణికందన్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని నటి చాందిని మాజీ మంత్రి మణికందన్‌పై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం సంచలనమైంది. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత మణికందన్ పరారీలో ఉన్నాడు.
సదరు 36 ఏళ్ల మహిళ ఫిర్యాదులో మణికందన్‌పై అత్యాచారం, గర్భస్రావం, మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి. భారత శిక్షాస్మృతిలోని ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2019 వరకు సమాచార సాంకేతిక మంత్రిగా పనిచేసిన మణికందన్‌ను పోలీసులు విచారణకు పిలిచినప్పటికీ ఆయన హాజరుకాలేదు. బుధవారం అతని ముందస్తు బెయిల్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొదట రామనాథపురం మధురైలో అతని కోసం వెతికారు. మణికందన్ డ్రైవర్ మరియు సహాయకుడిని పోలీసులు విచారణ కోసం పిలిచారు.
ఐదేళ్లకు పైగా సంబంధంలో ఉన్న మాజీ మంత్రి తనను మోసం చేశాడని మే 28 న నటి చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి తనను బలవంతంగా అబార్షన్ చేయించాడని, పలుసార్లు తనపై దాడి చేశాడని, సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో విడుదల చేయమని బ్లాక్ మెయిల్ చేసి, చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె ఆరోపించారు. విలేకరులతో ఆమె ఫిర్యాదు కాపీని మరియు నిందితుడితో వాట్సాప్ సంభాషణలతో సహా ఇతర పత్రాలను పంచుకుంది. మలేషియా టూరిజం కోసం పనిచేస్తున్నప్పుడు మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా 2017 లో తాను మంత్రికి పరిచయం అయ్యానని.. మలేషియాలో స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలనే నెపంతో మంత్రి తనతో సంబంధాన్ని పెంచుకున్నారని ఆమె చెప్పారు. అప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ ఆమెను పెళ్లి చేసుకుంటానని తనకు మాయ మాటలు చెప్పాడని తెలిపింది.