మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మజల్‌గావ్ తాలూకాలోని గ్రామంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కోపోద్రిక్తులైన కోతుల గుంపు "పగ" తీర్చుకోవడానికి దాదాపు 300 కుక్కలను చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. గత రెండు నెలల క్రితం ఓ కోతి పిల్లను ఓ కుక్క చంపేయడంతో.. అప్పటి నుండి కోతులు కుక్కలపై పగ పెంచుకున్నాయని స్థానికులు అంటున్నారు. గత నెల రోజుల నుంచి కోతులు కుక్క పిల్లలను చంపేస్తున్నాయి. కుక్కలను భవనాలు, చెట్ల పైకి లాక్కెళ్లి కింద పడేస్తున్నాయి.
ఈ ఘటనపై గ్రామస్తులు అటవీ శాఖాధికారులను సంప్రదించి కోతులను పట్టుకోవాలని కోరారు. అటవీ శాఖ అధికారులు ఒకరోజు వచ్చినా ఒక్క కోతిని కూడా పట్టుకోకపోవడంతో వెళ్లిపోయారని తెలిసింది. గ్రామానికి చెందిన సీతారాం నైబాల్‌కు చెందిన కుక్కపిల్లను కూడా పక్షం రోజుల క్రితం కోతి తీసుకెళ్లింది. కుక్కపిల్ల అరవడం ప్రారంభించడంతో.. నైబాల్ తన పెంపుడు జంతువును రక్షించగలిగాడు. కుక్కను రక్షించేందుకు నైబాల్ కాలు విరిగి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
అయితే కోతులు ఎందుకు ఆగ్రహించాయి?
కోతులు పగ తీర్చుకుంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని కుక్కలు పిల్ల కోతిని చంపడంతో ఇదంతా ప్రారంభమైందని, ఆ తర్వాత కోతులు ఆ ప్రాంతంలోని కుక్కలను భయంకరమైన రీతిలో చంపడం ప్రారంభించాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో కుక్కల బెడద అంతంత మాత్రంగానే ఉన్నా కోతుల బెడద మాత్రం ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. కోతులు పాఠశాలకు వెళ్లే పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాయని తెలిసింది. ఈ దాడులతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.