జాతీయ నూతన విద్యా విధానం-2020 అమలులోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక ప్రసంగం చేశారు. దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత దగ్గర చేసేందుకు స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ దేశ యువత ఆశయాలకు నూతన విద్యావిధానం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇంజనీరింగ్ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐదు భారతీయ భాషల్లో విద్యా బోధన ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని మోదీ అన్నారు. ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్‌ను కూడా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భాషల్లో చదవబోతున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే మహాయజ్ఞంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.