ఏనుగులను కంచెలతో ఆపగలమని మానవులు అనుకుంటే అది పొరపాటే. కర్ణాటకలో ఏనుగు ఇనుప కంచెపైకి ఎక్కి దాటేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏనుగు కంచెపైకి ఎక్కి దాటేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలో ఏనుగు కంచెకి అవతలి వైపున దాని ముందరి పాదాలను పెట్టేయడం మనం చూడొచ్చు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విటర్‌లో పంచుకున్నారు. "మాట్లాడటానికి ఏమీ లేదు" అని క్యాప్షన్ ఇచ్చారు. 27 సెకన్ల వీడియోను లక్షల్లో వీక్షించారు. వేలల్లో లైక్స్ వచ్చాయి.
ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలోని నాగరహోళెలో చోటుచేసుకుంది. నాగరహోళె టైగర్ రిజర్వ్ డైరెక్టర్ మహేష్ కుమార్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ వీరనహోసల్లి రేంజ్‌లో వీడియో రికార్డ్ చేయబడిందని తెలిపారు. నవంబర్ 16 ఉదయం ఏనుగు పంటలపై దాడి చేసి అడవికి తిరిగి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఏనుగు కంచెను అతి సులభంగా దాటడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.