మంత్రి కోడలు ఉరివేసుకుని ఆత్మహత్య
Education Minister Parmar's daughter-in-law hanged. మధ్యప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 11 May 2022 4:57 PM ISTమధ్యప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు మంత్రి ఎదుటే 'నీపై 302 సెక్షన్ (హత్య కేసు) పెట్టాలి, నువ్వు మంత్రివైతే ఏంటి' అంటూ ఆవేశంగా వ్యాఖ్యలు చేశాడు. మంత్రి కోడలు సవిత పర్మార్ షాజాపూర్ జిల్లాలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. సవితా పర్మార్ తన నివాసంలో శవమై కనిపించిందని.. ఆమె బంధువులు ధృవీకరించారని ANI వార్తా సంస్థ తెలిపింది. కుటుంబంలో కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు ఉన్నా.. పోలీసులు ఇంకా ఏమీ ధృవీకరించలేదని ANI నివేదించింది. సవితా పర్మార్ (22) మూడు సంవత్సరాల క్రితం ఇందర్ సింగ్ పర్మార్ కుమారుడు దేవరాజ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు.
సవితా పర్మార్ మృతదేహం బుధవారం ఉదయం 10.15 గంటలకు స్వగ్రామం పోచనేర్‌కు చేరుకుంది. 5 నిమిషాల పాటు మృతదేహాన్ని ఇంట్లో ఉంచి అంత్యక్రియల నిమిత్తం ముక్తిధామానికి తరలించారు. మృతదేహాన్ని చూసిన సవిత తండ్రి పెద్దగా కేకలు వేస్తూ స్పృహతప్పి పడిపోయారు. మంగళవారం సాయంత్రం సవిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో మంత్రి లేరు, ఆయన కుమారుడు దేవరాజ్ కూడా లేరు. ఈ ఉదయం షుజల్‌పూర్‌లో పోస్టుమార్టం అనంతరం మంత్రి కోడలు మృతదేహం గ్రామానికి చేరుకుంది. ఆత్మహత్య సమయంలో, ఇందర్ సింగ్ పర్మార్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఉండగా, సవిత భర్త దేవరాజ్ సింగ్ ప్రక్కనే ఉన్న గ్రామమైన మొహమ్మద్ ఖేరాలో ఒక వివాహానికి హాజరైనట్లు సమాచారం. మృతదేహానికి సమీపంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.