నిరీక్షణకు తెర.. నేడు రెండు రాష్ట్రాల్లో మోగనున్న అసెంబ్లీ ఎన్నికల నగారా
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేయనుంది ఎన్నికల సంఘం
By Medi Samrat Published on 15 Oct 2024 9:28 AM ISTమహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను నేడు విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈసీ విలేకరుల సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్ని దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎలాంటి సన్నాహాలు చేశారో కమిషన్ చెబుతుంది.
ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. శివసేన, ఎన్సీపీ రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్నాయి. ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ మహా వికాస్ అఘాడీ కూటమి కింద ఎన్నికల్లో పోటీ చేయనుండగా.. షిండే వర్గానికి చెందిన శివసేన, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ మహాయుతి కూటమి కింద ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.
నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి 48 స్థానాలకు గానూ 30 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి కేవలం 17 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే హర్యానా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ బీజేపీ ఉత్సాహం ఉరకలెత్తనుంది.
ఇదిలావుంటే.. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే చివరిసారిగా 2019లో 5 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 15 తర్వాత జార్ఖండ్‌లో ఎన్నికలు జరగొచ్చు.
ఎన్నికల సంఘం జార్ఖండ్‌లో పర్యటించిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఛత్ పూజ, బిర్సా జయంతి, రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి. అంతేకాకుండా దశలవారీగా ఎన్నికలు నిర్వహించాలని అందరూ కమిషన్‌కు సూచించారు.