ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్‌లలో సోమవారం భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 30 నిమిషాల వ్యవధిలో 3.5 మరియు 3.8 తీవ్రతతో ఈ రెండు భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే.. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 3.5 తీవ్రతతో తొలి భూకంపం తెల్లవారుజామున 2.11 గంటలకు సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రం అస్సాంలోని కాచర్ జిల్లాలో భూమికి 35 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉందని ఎన్‌సిఎస్ పేర్కొంది.
రెండో భూకంపం మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి ప్రాంతంలో తెల్లవారుజామున 2.39 గంటలకు 3.8 తీవ్రతతో నమోదయ్యింది. భూకంప కేంద్రం భూమికి 20 కి.మీ లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఎన్‌సిఎస్ ప్రకారం, జనవరి 13న కూడా కాంగ్‌పోక్పిలో రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతతో భూకంపం నమోదైంది. జనవరి 4న తామెంగ్‌లాంగ్, చందేల్ ప్రాంతాలలో.. అలాగే కొత్త సంవత్సరం ప్రారంభం నుండి మణిపూర్‌లోని వివిధ ప్రాంతాలలో భూప్రకంపనలు నమోదయ్యాయి. అస్సాంలో కూడా జనవరి 6న సోనిత్‌పూర్‌లో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.