మణిపూర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు.. తీవ్ర‌త ఎంతంటే..?

Earthquake of magnitude 4.0 hits Manipur's Ukhrul district.మ‌ణిపూర్ రాష్ట్రంలో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2023 7:49 AM IST
మణిపూర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు.. తీవ్ర‌త ఎంతంటే..?

మ‌ణిపూర్ రాష్ట్రంలో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రాజ‌ధాని ఇంఫాల్‌కు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉఖ్రుల్ జిల్లాలో శ‌నివారం ఉద‌యం 6.14 గంట‌ల స‌మ‌యంలో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.0గా న‌మోదు అయిన‌ట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.

కాగా.. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు చెప్పారు.

ఇదిలా ఉంటే.. శుక్రవారం రాత్రి పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల‌లో భూమి కంపించింది. షామ్లీ కేంద్రంగా రాత్రి 9.31 గంటల స‌మ‌యంలో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.2గా న‌మోదైంది.

భూకంపాలపై NCS యొక్క తాజా నివేదికల ప్రకారం.. డిసెంబర్ నెలలో భార‌త దేశంలో 38 భూకంపాలు సంభ‌వించాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లలో అత్య‌ధికంగా 6 సార్లు చొప్పున భూమి కంపించిన‌ట్లు తెలిపింది.

భూకంపం సమయంలో ఏమి చేయాలి:

భూకంపం సంభవించినప్పుడు ఆందోళ‌న చెంద‌కూడ‌దు. ప్ర‌శాంతంగా ఆలోచించాలి. ఇత‌రుల‌కు భ‌రోసా ఇవ్వాలి. ఎల్లప్పుడూ సురక్షితమైన స్థలం కోసం వెత‌కాలి. భవనాలకు దూరంగా బహిరంగ ప్రదేశంలో ఉంటే చాలా మంచిది.

ఒకవేళ మీరు ఇంట్లో ఉన్న‌ప్పుడు భూమి కంపిస్తే బెంచీలు లేదా బ‌ల్ల‌లు, లేదా డెస్క్‌లు లేదా బెడ్ కిందకు వెళ్లాలి. గాజు వ‌స్తువులు, కిటికీల‌కు దూరంగా ఉండాలి. బయట ఉంటే భవనాలు, యుటిలిటీ వైర్ల నుంచి దూరంగా వెళ్లాలని, కదులుతున్న వాహనాలను వెంటనే ఆపేయాలి.

Next Story