భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల లో బాలికలకు అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు. చాలా మంది బాలికలు తనకు లేఖలు రాస్తున్నారని ఇక నుంచి బాలికల కోసం అన్ని సైనిక్ స్కూళ్ల తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోదీ తెలిపారు. రెండున్నరేళ్ల కిందట తొలిసారి ప్రయోగాత్మకంగా మిజోరంలోని సైనిక్ స్కూల్‌లో బాలికలను అనుమతించినట్లు మోదీ చెప్పారు.ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూళ్లు మన దేశంలోని కూతుళ్ల కోసం తలుపులు తెరుస్తాయని ఆయన తెలిపారు.
రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే సైనిక్ స్కూల్స్ సొసైటీ ఈ సైనిక్ స్కూళ్లను నిర్వహిస్తుంది. భారత సాయుధ బలగాల వైపు అడుగులు వేసేలా చిన్నతనం నుంచే విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. విద్య లేదా క్రీడలు, బోర్డు ఫలితాలు లేదా ఒలింపిక్స్ పతకాలు దేశానికి గర్వకారణమైన అంశాల్లో మా కుమార్తెలు ఈ రోజు అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ఈ రోజు, భారతదేశం కుమార్తెలు అన్నిటినీ అధిగమిస్తూ ఉన్నారని ప్రధాని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి.