మీకు ధ్యానం ఎలా చేయాలో తెలియకపోతే.. మా ధ్యానానికి భంగం కలిగించకండి : కాంగ్రెస్‌కు సీఎం కౌంట‌ర్‌

ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానానికి విపక్షాలు భంగం కలిగించవద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆయన..

By Medi Samrat  Published on  31 May 2024 8:40 PM IST
మీకు ధ్యానం ఎలా చేయాలో తెలియకపోతే.. మా ధ్యానానికి భంగం కలిగించకండి : కాంగ్రెస్‌కు సీఎం కౌంట‌ర్‌

ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానానికి విపక్షాలు భంగం కలిగించవద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ శుక్రవారం అన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆయన.. హిందూ సంప్రదాయాలను కాంగ్రెస్ ఎప్పుడూ ప్రశ్నిస్తోందని ఆరోపించారు. "ప్రతిపక్షాలకు ధ్యానం ఎలా చేయాలో తెలియకపోతే.. వేరొకరి ధ్యానానికి భంగం కలిగించడానికి ప్రయత్నించకూడదు" అని అన్నారు.

మోదీ సునామీ కొనసాగుతుంద‌ని.. ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఆ సునామీ తుడిచిపెట్టేస్తుందని అన్నారు. ఆపై కాంగ్రెస్ కనుమరుగ‌వుతుంద‌న్నారు. లోక్‌సభ ఎన్నిక‌ల‌లో బీజేపీ 400 మార్కును దాటుతుందని ఆయ‌న‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఓట‌మి త‌ర్వాత కాంగ్రెస్‌ ఎప్పటిలాగే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మరియు జిల్లా మేజిస్ట్రేట్లను నిందిస్తుంద‌ని అన్నారు.

ప్రధాని మోదీ ధ్యానంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. మోదీ కన్యాకుమారిలో చేస్తున్నది డ్రామా.. దాదాపు 10,000 మంది ఉన్నారు. దేశ ధనం వృధా. ఎన్నిక‌ల‌ నియమావళి అమలులో ఉందని ఆయ‌న‌కు తెలుసు. ఖర్చులు ఎవరు భరిస్తారు? మీకు దేవుడిపై అంత నమ్మకం ఉంటే.. మీ ఇంట్లో చేయండి.. లేదా మీ జేబులోంచి ఖర్చులు భరించండని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురువారం సాయంత్రం నుండి కన్యాకుమారిలోని ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల ధ్యానాన్ని ప్రారంభించారు. కన్యాకుమార్‌ చేరుకున్న తర్వాత భగవతి అమ్మన్‌ ఆలయంలో ప్రార్థనలు చేశారు.

ఆ తరువాత ప్ర‌ధాని పడవలో ఎక్కి తీరానికి 500 మీటర్ల దూరంలో సముద్రంలో ఒక రాతిపై ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్‌కు చేరుకుని.. జూన్ 1 వరకు కొనసాగే త‌న‌ ధ్యానంను ప్రారంభించారు. ప్రధాని మోదీ 45 గంటల ధ్యానంలో.. కేవ‌లం లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకుంటారని సమాచారం. ఆయ‌న‌ కొబ్బరి నీరు తాగుతారు. ద్రాక్ష రసం తీసుకుంటారు.

Next Story