డోలో-650 మాయ.. సుప్రీం కోర్టు సీరియస్..!
Dolo-650 makers spent Rs 1,000 cr on docs for prescribing drug. జ్వరం వస్తే ఇచ్చే డోలో-650 మాత్రను డాక్టర్లు రాస్తున్నారంటే అందుకు కారణం వేరే అని చెబుతున్నారు.
By Medi Samrat Published on 19 Aug 2022 5:33 PM ISTజ్వరం వస్తే ఇచ్చే డోలో-650 మాత్రను డాక్టర్లు రాస్తున్నారంటే అందుకు కారణం వేరే అని చెబుతున్నారు. ఆ మాత్రల తయారీదారులు డాక్టర్లకు రూ.1000 కోట్ల తాయిలాలు ఇవ్వడం వల్లేనని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం.. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో కేంద్రం తన స్పందనను 10 రోజుల్లోగా తెలియజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. "నాకు కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే మాత్ర వాడాలని రాశారు. ఇది సీరియస్ మ్యాటర్" అని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్ ను ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసింది. ఈ సంస్థ తరఫున న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. డోలోను ప్రమోట్ చేసేందుకు సదరు కంపెనీ డాక్టర్లకు తాయిలాలుగా రూ.1000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. ఇటువంటి అవినీతి మందుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని, లేకపోతే, మార్కెట్లో నిర్హేతుకమైన ఔషధాలు పోగుపడే అవకాశాలు ఉంటాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఫార్మా ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని.. తగిన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ప్రజలకు ఇలా మెడిసిన్ ఇచ్చే ప్రక్రియ చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. మైక్రో ల్యాబ్స్ అనే సంస్థ డోలో 650 మాత్రలను తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాల్లో గతంలో సోదాలు జరిగాయి. మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయంలో పలు పత్రాలు లభించాయి. 2020లో కరోనా వ్యాప్తించిన తర్వాత కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. ఏడాదిలో రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. డోలో ఉత్పత్తిదారులు అనైతిక పద్ధతులు పాటించారని ఫెడరేషన్ ఆరోపించింది. ఇలా చేయడం వల్ల మందులు ఓవర్ డోస్ కావడంతో పాటు.. పేషెంట్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని, ఇలాంటి అవినీతికి పాల్పడటం వల్ల మార్కెట్లోకి ఎక్కువ ధరలు ఉన్న లేదా అహేతుకమైన మందులు చొప్పిస్తారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినంగా లేకపోవడం వల్ల ఫార్మా సంస్థలు అనైతిక పద్ధతులను పట్టిస్తున్నాయని పిటీషన్ లో చెప్పారు.