మమత 115 స్కామ్‌లు VS మోదీ 115 స్కీములు
'Didi's 115 scams vs PM Modi's 115 schemes.పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అందుకు
By తోట వంశీ కుమార్ Published on 25 March 2021 11:05 AM GMTపశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసింది. బీజేపీకి చెందిన బడా నాయకులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా.. పలువురు బీజేపీ నాయకులు పశ్చిమ బెంగాల్ లో ప్రచారం నిర్వహిస్తూ.. మమతా బెనర్జీ మీద తీవ్ర ఆరోపణలు మొదలుపెట్టారు.
పశ్చిమ బెంగాల్ ను పాలించడంలో మమతా బెనర్జీ పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఆమె విఫలమయ్యారనీ.. ఆటో మొబైల్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని ఆమె మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బెంగాల్ లోని పురులియా జిల్లాలో కీలకమైన కుర్మి సామాజిక వర్గంతో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశాభివృద్ది కోసం 115 స్కీమ్‌లు ప్రవేశపెట్టారని.. కానీ బెంగాల్‌లో దీదీ 115 స్కాం లు తెచ్చారన్నారు. స్కీమ్‌లు కావాలంటే మోదీకి ఓటెయ్యాలనీ.. స్కామ్‌లు కావాలంటే మమత నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వానికి ఓటెయ్యాలని అన్నారు. కుర్మి వర్గంలోని ప్రతి ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తామనీ.. వారి భాషలోనే విద్యా బోధనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీదీ పాలన కారణంగా పురులియాలో ప్రజలు ఇప్పటికీ ఫ్లోరైడ్ నీళ్లు తాగాల్సి వస్తోందనీ, తాము ఇక్కడ రూ.10 వేల కోట్ల శుద్ధమైన తాగునీటి ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పశ్చిమ బెంగాల్ లో బీజేపీదే విజయం అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200కు పైగా స్థానాలు గెలుచుకోవడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధించగలదని కచ్చితంగా చెప్పగలనని.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే రాజ్యాంగం ప్రకారం నడుచునేదే తప్ప అహంకారంతో నడవదని అన్నారు.