దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళను కారు ఈడ్చుకెళ్లి హతమార్చిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా విమర్శలకు దారి తీసింది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందనే విమర్శలు వచ్చాయి. ఇక ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 11 మంది పోలీసులు సస్పెండ్ చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మూడు పీసీఆర్ వ్యాన్లు, రెండు పికెట్లలో ఉన్న సిబ్బంది అందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా వెల్లడించారు.
ఢిల్లీలో న్యూ ఇయర్ రోజున కంఝవాలాలో స్కూటీపై వెళ్తున్న ఈవెంట్ ప్లానర్ అంజలీ సింగ్‌ను.. కొందరు నిందితులు కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. రోడ్డుపై అంజలీసింగ్ మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పెషల్ కమిషనర్ షాలినీ సింగ్ నేతృత్వంలోని కమిటీ విచారించింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికను అనుసరించి కేంద్ర హోంశాఖ ఈ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. వీరంతా కంఝువాలా ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న రోహిణీ ప్రాంత పోలీసులు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు సబ్‌ఇన్‌స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. వీరిలో ఆరుగురికి పీసీఆర్ డ్యూటీ ఉండగా, ఐదుగురు పికెట్లు నిర్వహిస్తున్నారు.