'సుప్రీం' ఆదేశాలకు వ్యతిరేకంగా నిరసన.. జంతు ప్రేమికులపై ఎఫ్‌ఐఆర్

వీధికుక్కలను పట్టుకుని షెల్టర్‌హోమ్‌లకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత జంతు ప్రేమికులు సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.

By Medi Samrat
Published on : 19 Aug 2025 8:30 PM IST

సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా నిరసన.. జంతు ప్రేమికులపై ఎఫ్‌ఐఆర్

వీధికుక్కలను పట్టుకుని షెల్టర్‌హోమ్‌లకు పంపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత జంతు ప్రేమికులు సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు. దీంతో పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రారంభించారు. ఆగస్టు 16న కన్నాట్ ప్లేస్‌లో అనుమతి లేకుండా ప్రదర్శన చేసిన 43 మంది జంతు ప్రేమికులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారిపై BNS సెక్షన్లు 223A, 221,132,121 కింద కేసు నమోదు చేయబడింది.

పోలీసు అధికారి తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఆగస్టు 16న సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో జంతు ప్రేమికులు నిరసనకు వెళుతున్నట్లు ఇంటర్నెట్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో వెల్లడించింది.

సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు.. పారామిలటరీ బలగాలను అక్కడ భద్రత కోసం మోహరించారు. కొద్దిసేపటికే 800 నుండి 900 మంది నిరసనకారులు అనుమతి లేకుండా కన్నాట్ ప్లేస్ ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర‌స‌న‌కారులు కొంద‌రు ఢిల్లీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. పోస్టర్‌ల‌పై అభ్యంతరకర పదాలు కూడా ఉపయోగించారు. ఇది చట్టవిరుద్ధమైన ప్రదర్శన అని చెప్పి పోలీసులు వారిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వారు అంగీకరించలేదు. కొందరు ఆందోళనకారులు పోలీసులను తోసివేయడం, దాడి చేయడం ప్రారంభించారు. దీంతో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని మరోచోట విడిచిపెట్టారు. ఆపై ప‌లువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Next Story