ఢిల్లీ అగ్నిప్రమాద ఘ‌ట‌న : ఏడు మృత‌దేహాల గుర్తింపు

Delhi fire tragedy: 7 bodies identified. ఢిల్లీలో శుక్రవారం నాటి భారీ అగ్నిప్రమాదంలో భవనం నుంచి వెలికితీసిన 27 కాలిపోయిన మృతదేహాలలో

By Medi Samrat  Published on  14 May 2022 7:15 PM IST
ఢిల్లీ అగ్నిప్రమాద ఘ‌ట‌న : ఏడు మృత‌దేహాల గుర్తింపు

ఢిల్లీలో శుక్రవారం నాటి భారీ అగ్నిప్రమాదంలో భవనం నుంచి వెలికితీసిన 27 కాలిపోయిన మృతదేహాలలో ఏడుగురిని పోలీసులు గుర్తించగలిగారని శనివారం ఒక అధికారి తెలిపారు. చ‌నిపోయిన వారిని తానియా భూషణ్, మోహిని పాల్, యశోదా దేవి, రంజు దేవి, విశాల్, దృష్టి, కైలాష్ జ్యానీగా గుర్తించారు. మిగిలిన 20 మందిని గుర్తించాల్సి ఉంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల ఉన్నవారిని గుర్తుప‌ట్ట‌డానికి వీలు లేకుండా కాలిపోయారు. దీంతో మృతుల బంధువులు సైతం వారిని క‌నుగొన‌లేక‌పోతున్నారు.

ఘటన జరిగినప్పటి నుండి 24 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఇప్పటికీ కనిపించలేదు. బీహార్‌లోని సహర్సాకు చెందిన మనోజ్ ఠాకూర్.. ఘటన జరిగినప్పుడు భవనం వద్ద ఉన్న తన భార్య సోనీని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదం గురించి తెలియజేయడానికి సోనీ తనకు ఫోన్ చేసిందని, అయితే ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఆయన చెప్పారు.

ప్ర‌మాదంతో సంజయ్ గాంధీ ఆసుపత్రిలో రాత్రంతా గందరగోళం నెలకొంది. మృతదేహాలను గుర్తించడానికి బంధువులు ఒక్క‌సారిగా పోటెత్తారు. "నేను గత 12 గంటలుగా ఇక్కడ కూర్చున్నాను. నా భార్య ఎక్కడ ఉందో నాకు ఎటువంటి క్లూ లేదు. మాకు అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు" అని హాస్పిటల్‌లోని మరొక వ్యక్తి చెప్పారు. అతని భార్య ఘ‌ట‌న జ‌రిగిన భవనంలో పని చేస్తుంది.

తప్పిపోయిన మరో వ్యక్తి బంధువులు మాట్లాడుతూ.. వార్తలను చూస్తుండగా సంఘటన గురించి తమకు తెలిసిందని, అప్పటి నుండి తమ బంధువు కోసం వెతుకుతున్నామని చెప్పారు. తప్పిపోయిన వారి బంధువుల ఆచూకీ కోసం ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

















Next Story