బంగాళాఖాతంలో భారీగా ఏర్పడి తూర్పు తీరంపై తన ప్రభావం చూపించిన యాస్ తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపార నష్టం కలిగింది. యాస్ తుఫానుతో కలిగిన నష్టాన్ని సమీక్షించి, స్వయంగా అంచనా వేసేందుకు ప్రధాని మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో పర్యటన సాగించారు. బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలతో పరిస్థితిని మోదీ సమీక్షించారు

బాధితుల‌ పట్ల తన సంతాపం ప్రకటించారు. ప్ర‌కృతి విలయ తాండవం లో త‌మ వాళ్ల‌ను కోల్పోయినవారి కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ప్రకటించారు. అంతేకాకుండా గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని కార్యాల‌యం మీడియాకు వెల్ల‌డించింది. తుఫాన్ కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని ఆధారంగా చేసుకుని ఈ సాయం ప్ర‌క‌టించిన‌ట్లు వివ‌రించింది. అదేవిధంగా త‌క్ష‌ణ ఆర్థిక సాయం కింద తుఫాన్ ప్రభావిత రాష్టమైన ఒడిశా రాష్ట్రానికి రూ.500 కోట్లు, ప‌శ్చిమ‌బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు మ‌రో రూ.500 కోట్ల ఆర్థిక సాయాన్ని కేటాయించిన‌ట్లు తెలిపింది.

మొదటగా ఒడిశా సీఎంతో సమావేశం నిర్వహించిన మోదీ తుపాను దెబ్బకి అల్లకల్లోలం అయిన భద్రక్ జిల్లాను పరిశీలించారు. అనంతరం పశ్చిమ బెంగాల్ లోని ఈస్ట్ మిడ్నపూర్ ప్రాంతంలోనూ ఏరియల్ సర్వే నిర్వహించి తుపాను బీభత్సం మిగిల్చిన నష్టాన్ని పరిశీలించారు.

ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను వణికించిన యాస్ తుపాను రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించడం తెలిసిందే. ఈ తుపాను సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు చెట్లు, భవనాలు కూలిపోయాయి. సాదా ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించకపోతే మరింత తీవ్ర జననష్టం జరిగి ఉండేది. ఇంత చేసినప్పటికి ఒడిశాలో ముగ్గురు, పశ్చిమ బెంగాల్ లో ఒకరు మరణించారు.


జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story