అయోధ్యనే కాదు.. బద్రీనాథ్ ను కూడా కోల్పోయిన బీజేపీ
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బద్రీనాథ్ సీటు ను కోల్పోయింది.
By Medi Samrat Published on 13 July 2024 10:45 AM GMTఉత్తరాఖండ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బద్రీనాథ్ సీటు ను కోల్పోయింది. ఉత్తరాఖండ్‌లోని రెండు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఖాజీ మహ్మద్ నిజాముదీన్ 400 ఓట్ల స్వల్ప తేడాతో మంగ్రాల్ లో గెలుపును సొంతం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర భండారీని 5000 ఓట్ల తేడాతో ఓడించి.. బద్రీనాథ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నేత లఖపత్ సింగ్ బుటోలా దక్కించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బగ్దా నియోజకవర్గాల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని దేహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు భార్య కమలేశ్ ఠాకూర్ ఘన విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి హోష్యార్ సింగ్‌పై 9 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి హోష్యార్ సింగ్ దాదాపు 4 వేల ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయన వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. జులై 10న ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఓ మోస్తరు నుండి.. అధిక శాతం ఓటింగ్ నమోదైంది. వివిధ పార్టీలకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యేల మరణాలు లేదా రాజీనామాల కారణంగా ఏర్పడిన ఖాళీల కారణంగా ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.