'రాజ్యాంగాన్ని కాపాడేందుకు మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండండి' అంటూ ప్రధానిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా మంగళవారం ఉదయం అరెస్టయ్యారు. దామోహ్ జిల్లాలోని హటా పట్టణంలోని ఆయన నివాసానికి ఈ ఉదయం చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు హటా సబ్ డివిజనల్ ఆఫీసర్ వీరేంద్ర బహదూర్ సింగ్ తెలిపారు.
పవాయిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పటేరియా మాట్లాడుతూ ప్రధాని మోదీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి' అని అన్నారు. ఇక్కడ చంపడం అంటే ఓడించడం అని అర్థం.
ఇందుకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆయన మాటలను ఖండించారు. ఈ నేపథ్యంలో పవాయీ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.
కాగా.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని పటేరియా అన్నారు.