పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేనా..!
Congress Government In Puducherry Slips Into Minority Ahead Of Polls. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం
By Medi Samrat
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది. ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి నారాయణస్వామి సర్కార్ మైనార్టీలో పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే రాజీనామాలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఎన్నికలపై సమీక్ష జరిపేందుకు ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
రెండు రోజుల క్రితమే యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. యానం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మల్లాడి కృష్ణారావు.. నారాయణ స్వామి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత నెలలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా యానాం శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మల్లాడి కృష్ణారావు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని యానాంకు 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు.
ఆయన ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే మంగళవారం నాడు మరో నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పుద్దుచ్చేరి రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి నారాయణస్వామి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కెబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యనేతలు, సీనియర్లతో విడివిడిగా సమావేశం అయ్యారు. మొత్తం 30 మంది శాసనసభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తాజా రాజీనామాలతో అధికార పార్టీ బలం 11కి పడిపోయింది.