మా ఎంపీల‌ను నెట్టారు.. రాహుల్‌పై పోలీసుల‌కు బీజేపీ ఫిర్యాదు

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, అనురాగ్ ఠాకూర్ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

By Medi Samrat  Published on  19 Dec 2024 9:42 AM GMT
మా ఎంపీల‌ను నెట్టారు.. రాహుల్‌పై పోలీసుల‌కు బీజేపీ ఫిర్యాదు

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో జరిగిన గొడవ కేసులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ ఎంపీలు బన్సూరి స్వరాజ్, అనురాగ్ ఠాకూర్ సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సంబంధించిన అంశంపై ప్రతిపక్షాలు, అధికార పార్టీ ఎంపీలు గురువారం పార్లమెంట్‌ ఆవరణలో బైఠాయించారు. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట జరిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నెట్టారని, దాని వల్లే తమ సీనియర్ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది. సారంగిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు, బీజేపీ ఎంపీలు తనను, ఇతర విపక్ష సభ్యులను పార్లమెంట్‌ హౌస్‌లోకి రాకుండా అడ్డుకుని నెట్టారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఈరోజు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. బాబా సాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ సమస్యపై కాంగ్రెస్‌, బీజేపీలు పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో ధర్నా చేశాయి. ఈ సమయంలో మకరద్వార్ వద్ద ఇరు పార్టీల ఎంపీల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తలకు గాయమైంది. బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు. ఆయ‌న‌ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలోని ఐసీయూలో చేర్చారు. సారంగి కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంపీల యోగక్షేమాలను ప్రధాని మోదీ ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు.

Next Story