కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా పర్యటిస్తున్న వేళ.. జమ్ముకశ్మీర్‌లో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో ఓ సాధారణ పౌరుడు మృతి చెందాడు. షోపియాన్ జిల్లా బాబాపొరా ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఇటీవల కాలంలో కశ్మీర్ లోయలో కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. బీహార్‌కు చెందిన ఐదుగురు కార్మికులు, మరో ఇద్దరు ఉపాధ్యాయులు టెర్రరిస్టుల కాల్పుల్లో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా భద్రతబలగాలు ఉగ్రవాదుల అణచివేతను తీవ్రతరం చేశాయి. దీంతో టెర్రరిస్టులు.. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. ఇవాళ బాబాపొరాలో జరిగిన కాల్పులు కూడా టెర్రరిస్టుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు, భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. జమ్ముకశ్మీర్‌లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన జరుగుతుండగా కాల్పులు జరగడం శోచనీయం. మరోవైపు పూంచ్ జిల్లా మెంధార్ వద్ద టెర్రరిస్టుల కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఓ ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా బలగాలు ముట్టడించాయి. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. తాజాగా టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఒక జవాను, బందీగా ఉన్న టెర్రరిస్టు గాయపడ్డారు.