ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రాష్ట్రంలో రిజర్వేషన్లను 76 శాతానికి పెంచింది. రాష్ట్రంలోని జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యారంగంలో ప్రవేశాలు, పదోన్నతుల్లో అవకాశం కల్పించేందుకు ఉద్దేశించి రెండు బిల్లుల్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 69 శాతం రిజర్వేషన్లు 76 శాతానికి చేరాయి. తాజా పెంపుతో ఓబీసీ రిజర్వేషన్ ఎక్కువగా పెరిగినట్టైంది. ఇంతకు ముందు ఓబీసీలకు 14 శాతం మాత్రమే రిజర్వేషన్ లభించేంది. తాజా మార్పుతో 27 శాతానికి వారి రిజర్వేషన్ పెరిగింది. ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ (షెడ్యూల్డ్ కేస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్) అమెండ్‌మెంట్ బిల్లు, ఛత్తీస్‌గఢ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్) అమెండ్‌మెంట్ బిల్లులను ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సుమారు 5 గంటల చర్చ అనంతరం ఈ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించింది.