నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3
Chandrayaan-3 mission accomplished, it has started its journey towards moon. భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది.
By Medi Samrat
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ ఎగిసింది. నిర్దేశిత సమయానికే ఈ మధ్యాహ్నం 2.35.13 గంటలకు రాకెట్ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగానికి శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదికను ఉపయోగించుకున్నారు. ప్రొపల్షన్ మాడ్యూల్ ఆగస్టు 23 లేదా 24వ తేదీ నాటికి చందమామ ఉపరితలంపై ల్యాండవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చంద్రయాన్-3 మిషన్ కు సంబంధించి శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యునైటెడ్ స్టేట్స్, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత అరుదైన ఘనతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలవనుంది. ఇస్రో అధికారుల ప్రకారం, లిఫ్ట్ ఆఫ్ అయిన 16 నిమిషాల తర్వాత, ప్రొపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుండి విడిపోతుంది. భూమికి 170 కిమీ దగ్గరగా, 36,500 కిమీ దూరంలో చంద్రుని వైపు కదులుతూ దీర్ఘవృత్తాకార చక్రంలో భూమి చుట్టూ 5-6 సార్లు తిరుగుతుంది.
చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. చంద్రయాన్–3 బరువు 3,920 కిలోలు.. ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలుంటాయి. చంద్రయాన్–2లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు.
వేలాదిగా తరలివచ్చారు
చారిత్రాత్మక ప్రయోగాన్ని వీక్షించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. రాకెట్ గగనతలంలోకి ఎగరడంతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 ప్రయోగంతో భారతదేశం చరిత్ర సృష్టించే ప్రయత్నాన్ని చూసేందుకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం దగ్గరకు భారీగా వచ్చారు. ఎండను ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. షార్ ప్రవేశద్వారం వైపు వెళ్లే రహదారిపై ప్రతి వంద మీటర్లకు పోలీసు సిబ్బందిని మోహరించి.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా పోస్ట్‌లో "At lift-off, it won't just be the rocket taking flight, it will be our spirits too Go, #Chandrayaan !" అని చెప్పుకొచ్చారు. పలువురు విద్యార్థులు కూడా లిఫ్ట్ ఆఫ్ సక్సెస్ అయినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.