పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వాటిని బయట వ్యక్తులకు పంపారనే వార్తలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యులు నిందితులను శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అందుకు తగ్గట్టుగా వదంతులు పెద్ద ఎత్తున వ్యాపించడం కూడా జరిగింది. తాజాగా అధికారులు యూనివర్సిటీ హాస్టల్ కు సంబంధించి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వార్డెన్ రజ్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్ చేశారు. వర్సిటీని శనివారం వరకు మూసి వేస్తున్నట్లు అధికారులు చెప్పారు. వీడియోలను రిలీజ్ చేసిన అమ్మాయిని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసుల్ని హాస్టల్ వార్డెన్ అడ్డుకున్నట్లు తెలిసింది. నిరసన చేసిన విద్యార్థినిలను కూడా ఆమె తిట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం నాలుగు వీడియోలను ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపించింది.
విద్యార్థిని తన సొంత వీడియోనే షేర్ చేసిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఐపీసీ సెక్షన్ 354 సీ (వోయూరిజం), ఐటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విద్యార్థినిని, సిమ్లాలో ఉంటున్న ఆమె బాయ్ ఫ్రెండ్ అరెస్టు చేశామన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మనీషా గులాటీ ఘటన వివరాలను విద్యార్థినులను అడిగి తెలుసుకొన్నారు.