ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలను విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు

By Medi Samrat  Published on  22 Dec 2023 2:51 PM GMT
ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం

రాష్ట్రాలకు పన్నుల్లో వాటాలను విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా రూపేణా రూ.72,961 కోట్లను విడుదల చేసింది. కేంద్రం అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.13,088 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రూ.2,952 కోట్లు, తెలంగాణకు రూ.1,533 కోట్లు విడుదల చేసింది. బీహార్ కు రూ.7,338 కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.5,488 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ.5,727 కోట్లు, మహారాష్ట్రకు రూ.4,609 కోట్లు, రాజస్థాన్ కు రూ.4,396 కోట్లు విడుదల చేసింది. వాస్తవానికి ఈ పన్నుల వాటా విడుదల 2024 జనవరి 10న విడుదల చేయాల్సి ఉండగా, పండుగ సీజన్, నూతన సంవత్సరాదిని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 11నే నిధులను విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇక ఇంతకు ముందే విద్యుత్తు రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు అర శాతం (0.5) రుణాలను అదనంగా పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. 15వ ఆర్థిక సంఘం, కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ సిఫార్సులతో మార్కెట్‌ నుంచి అదనపు రుణాలు పొందేందుకు అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. 2022-23కు సంబంధించి అదనపు రుణం తీసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, కేరళ, రాజస్థాన్‌, సిక్కిం, పశ్చిమబెంగాల్‌కు అవకాశం కల్పించింది. ఈ రాష్ర్టాలు మొత్తంగా రూ.27,238 కోట్లు రుణంగా తీసుకొన్నాయి. విద్యుత్తు సంస్కరణల్లో భాగంగా మూడు సంవత్సరాల పాటూ అదనపు రుణాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, 2021-22లో 12 రాష్ర్టాలు రూ.39,175 కోట్ల రుణాన్ని తీసుకున్నాయి. 2023-24లో రూ.1,43,332 కోట్లు తీసుకొనే అవకాశం ఉంది. 2021-22లో ఆంధ్రప్రదేశ్‌ రూ.3,716 కోట్ల అదనపు రుణం పొందగా, 2022-23లో రూ.5,858 కోట్లు పొందే అవకాశం దక్కింది.

Next Story