కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ల పదవీకాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టానికి మార్పులు చేస్తూ.. ఆర్డినెస్స్ తీసుకొచ్చింది. కొత్త ఆర్డినెన్సులతో ఇప్పటివరకూ రెండేళ్లుగా ఉన్న ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం ఐదేళ్లకు పెరగనుంది. ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్ 2021, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆర్డినెన్స్, 2021లను కేంద్రం జారీ చేసింది. ఈ రెండు ఆర్డినెన్సులు తక్షణం అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. ఆర్డినెన్స్‌లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. నియామకం ప్రారంభంలో పేర్కొన్న పదవీ కాలం పూర్తయిన తర్వాత ఒకేసారి ఒక ఏడాది వరకు పొడిగించవచ్చునని, మొత్తం మీద ఐదేళ్ళ వరకు పొడిగించవచ్చు.
ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ డైరెక్టర్లను రెండేళ్ళ నిర్ణీత కాలానికి నియమిస్తున్నారు. ఈ రెండేళ్ల పదవీ కాలం ముగియక ముందు వీరిని తొలగించడం సాధ్యం కాదు. ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత వీరి పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. తాజాగా విడుదల చేసిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (అమెండ్‌మెంట్) ఆర్డినెన్స్, 2021 ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ నియామకం ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలం ముగిసిన తర్వాత క్లాజ్ (ఏ) ప్రకారం కమిటీ సిఫారసు చేసిన మీదట ప్రజా ప్రయోజనాల రీత్యా, లిఖితపూర్వకంగా రాయదగిన కారణం మేరకు ఒక ఏడాది వరకు పదవీ కాలాన్ని పొడిగించవచ్చని తెలుస్తోంది.